పువ్వాడ నాగేశ్వరరావుకు తమ్మినేని వీరభద్రం పరామర్శ

సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర పార్టీ నేత పోతినేని సుదర్శన్ పరామర్శించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్ లోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు నాగేశ్వరరావు. ఈ క్రమంలో వారిని తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. తిరిగి పువ్వాడ ఆరోగ్యం కుదుట పడడంపై తమ్మినేని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ప్రస్తుత రాష్ట్ర, జిల్లా రాజకీయ పరిణామాలు వామపక్షాల ఐక్యత మరియు ఇతర రాజకీయ అంశాలపై పువ్వాడతో సీపీఎం నేతలు చర్చించారు. తన తనయుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో వారితో పాటు సీనియర్ పువ్వాడ ఉన్నారు.