తాలిబన్ల తాత్కాలిక మంత్రివర్గ ప్రమాణస్వీకారం రద్దు!

కాబుల్ : తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అయితే శనివారం జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు. సెప్టెంబర్‌ 11న మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఉంటుందని గత మంగళవారం తాలిబన్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మిత్ర దేశాలైన పాకిస్థాన్‌, చైనా, టర్కీ, రష్యా, ఇరాన్‌, కతర్‌ సహా పలు దేశాలను ఆహ్వానించారు. అయితే అమెరికాలోని న్యూయార్క్‌ జంట టవర్లపై జరిగి నేటితో 20 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేమని మిత్రదేశాలు తెలిపినట్లు సమాచారం. దోహా నుంచి వచ్చిన ఒత్తిళ్లతో తాలిబన్లు ఈ కార్యక్రమాన్ని వాయిదావేసినట్లు సమాచారం. కాగా, ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని ప్రకటించలేదు.

నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని ఆఫ్ఘాన్‌ ప్రభుత్వం రద్దు చేసినట్లు రష్యాకు చెందిన టీఏఎస్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈమేరకు తాలిబన్ల కల్చురల్‌ కమిషన్‌ సభ్యుడైన ఇమానుల్లా సమంగాని తెలిపినట్లు పేర్కొంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/