ముంబైలో మరో నిర్భయ ఘటన : ఇనుప రాడ్డుతో దారుణం

కోర్ట్ లు , ప్రబుత్వాలు , పోలీసులు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మారడం లేదు. ఒంటరిగా మహిళ రోడ్డుపైకి వెళ్లాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థినిలు, ఇతర పనికి వెళ్లేందుకు మహిళలు, చిన్నారులకు సైతం ఎవరికీ రక్షణ లేకుండా పోతోంది. గడప దాటితే గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ముంబై లో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటనను తలపించే గ్యాంగ్ రేప్ జరిగింది.
32 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమె మర్మాంగంలో ఇనుప రాడ్డుతో చిత్ర హింసలకు గురిచేశారు. దీంతో.. బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టు మిట్లాడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునిచూడగా.. బాధితురాలు రక్తపు మడుగులో పడి స్పృహ కోల్పోయి ఉంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యులు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా.. ఈ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి.. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్టు సమాచారం. నిందితుడిపై 376, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.