ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల విదేశి విద్యపై తాలిబాన్ నిషేధం

కాబూల్ దాటి వెళ్లరాదని హెచ్చరిక

taliban-bans-foreign-education-for-girls-of-afghanistan

కాబూల్‌ః ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మహిళలపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించారు. తాజాగా విద్యార్థినులపై హుకుం జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ అమ్మాయిలను విదేశాల్లో చదివేందుకు అంగీకరించబోమని, వారు కాబూల్ దాటి వెళ్లరాదని హెచ్చరించారు. అదే సమయంలో అబ్బాయిలు విదేశాల్లో చదవడంపై తాలిబన్లు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వెనుదిరిగిన తర్వాత 2021 సెప్టెంబరులో ఆఫ్ఘనిస్థాన్ పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసిన తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టారు. వచ్చీ రావడంతోనే తమదైన ముద్ర వేస్తూ మహిళలపై పలు ఆంక్షలు విధించారు. మహిళలు తమ ఇల్లు దాటి వచ్చి పనిచేయడంపై నిషేధాజ్ఞలు ప్రకటించారు. అమ్మాయిలకు ఆరో తరగతి వరకే చదువు, స్కూల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా విద్యాభ్యాసం వంటి నిర్ణయాలతో తామేమీ మారలేదని నిరూపించుకున్నారు. అంతేకాదు, మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే పూర్తిగా కప్పేసేలా దుస్తులు ధరించాలని కూడా స్పష్టం చేశారు. మహిళలు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్కుల్లోకి రావడంపైనా నిషేధం ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/