యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయం: సీఈసీ రాజీవ్‌కుమార్‌

central-election-commission-press-meet

హైదరాబాద్‌ఃతెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన ఈరోజుతో ముగిసింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించామని తెలిపారు. జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించామని.. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. 18-19 ఏళ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షల మంది ఉన్నారని.. నాలుగు గిరిజన తెగల్లో నూరు శాతం ఓటర్ల నమోదు జరిగిందని వెల్లడించారు.

80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నాం. తెలంగాణలో తొలిసారి 80 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుంచి ఓటేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం పోలింగ్‌ స్టేషన్లు: 35,356, ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌లో సగటు ఓటర్ల సంఖ్య 897 ఉంటుంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం అందుబాటులో సీ విజిల్‌ యాప్‌ అందుబాటులో ఉంది. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేశాం. ఎలాంటి అక్రమాలు మీ దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. ఓటర్లకు సాయం చేసేందుకు ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ అందుబాటులో ఉంటుంది అని రాజీవ్ కుమార్ తెలిపారు.

అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని రాజీవ్‌కుమార్‌ చెప్పారు. ఎన్నికల్లో ధన, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయని.. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగొచ్చని ఆందోళన చెందాయని తెలిపారు. తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉన్నారని.. స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామమని పేర్కొన్నారు. యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయమని అన్నారు.