తాలిబాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ సైనిక చర్య

90 మంది ఉగ్రవాదులు హతం

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం తాలిబాన్ ఉగ్రవాదులపై సైనిక చర్యను ముమ్మరం చేసింది. గత రెండు రోజుల్లో ఆఫ్ఘన్ దళాల వైమానికదళం జరుపుతున్న దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆఫ్ఘన్ ప్రభుత్వంతాలిబాన్ల మధ్య శాంతి చర్చలు నిలిచిపోయిన సమయంలో ఈ చర్య తీసుకుంటున్నారు. ఖతార్ రాజధాని దోహాలో చర్చలు జరిగాయి.

బాల్ఖ్ ప్రావిన్స్‌లోని చార్లక్ జిల్లాలో గురువారం రాత్రి వైమానిక దాడులు తాలిబాన్ రహస్య స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఓ వార్తా సంస్థ ఒక ఉన్నత సైనిక అధికారిని ఉటంకిస్తూ తెలిపింది. ముగ్గురు స్థానిక కమాండర్లతో పాటు 11 మంది ఉగ్రవాదులు ఇక్కడ మరణించారు. అదే ప్రాంతంలో బుధవారం రెండు వైమానిక దాడులు జరిగాయి. ఒక దాడిలో 31 మంది, మరో దాడిలో 26 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, హెల్మాండ్ ప్రావిన్స్‌లోని రెండు జిల్లాల్లో ఉగ్రవాద స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిగాయి. ఇక్కడ 27 మంది ఉగ్రవాదులు చనిపోయారు. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఘర్షణలు చెలరేగాయి. జనవరి 5 న ఆఫ్ఘన్ ప్రభుత్వంతాలిబాన్ల మధ్య రెండవ రౌండ్ చర్చలు ముగిశాయి.