మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ బాటలో కేసీఆర్ నడుస్తున్నాడంటూ నడ్డా ఫైర్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముంగిపు సందర్బంగా హన్మకొండ లో ఏర్పటు చేసిన బిజెపి భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా జెపి నడ్డా హాజరయ్యారు. ఈ సందర్బంగా కేసీఆర్ పాలనా ఫై నిప్పులు చెరిగారు. కేసీఆర్ నయా నిజాం అంటూ జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసారు. చివరి నిజాం కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారని … కేసీఆర్ కూడా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ బాటలో నడుస్తున్నారని చురకలంటించారు. నిజాం తరహాలోనే ప్రజలు కేసీఆర్ ను రాబోయే రోజుల్లో ఇంట్లో కూర్చోబెడుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ఇదే ముగింపు అని అన్నారు.

వరంగల్ ప్రజలకు నమస్కారాలు అంటూ జేపీ నడ్డా ప్రసంగం మొదలు పెట్టారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ముగింపు సభను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుట్రలు చేసిందన్నారు. కానీ, హైకోర్టు అనుమతితో సభ ఏర్పాటు చేశామని చెప్పారు. తాను హైదరాబాద్లో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు కూడా పాకిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందన్నారు. రూ.40వేల కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును మొదలు పెట్టిన కేసీఆర్ సర్కారు.. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.లక్ష 40 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 12 జిల్లాల్లో వరదలు వస్తే కేంద్రం రూ.377 కోట్లు ఇస్తే..ఆ నిధులను సీఎం కేసీఆర్ ప్రజలకు ఇవ్వలేదని జేపీ నడ్డా అన్నారు. జల్ జీవన్ స్కీం కింద కేంద్రం రూ.3,098 కోట్లు ప్రకటించిందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లే తీసుకుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కారు చాలా రకాలుగా నిధులు కేటాయించినా..వాటిని కేసీఆర్ డైవర్ట్ చేసి..కేంద్రంపై నిందలు మోపుతున్నారని నడ్డా ఆరోపించారు.