రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదిః తలసాని శ్రీనివాస్

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న తలసాని

minister-talasani-srinivas-yadav

హైదరాబాద్‌ః టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి విమర్శలు కురిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీతో పాటు దేశానికి ఎంతో సేవ చేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ ను తాను ఇంతకు ముందే ఖండించానని చెప్పారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరి కాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని చెప్పారు.

తనకు రాజీకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ అని అన్నారు. తన గుండెలో ఆయనకు శాశ్వత స్థానం ఉంటుందని చెప్పారు. అమీర్ పేటలో కానీ, సనత్ నగర్ లో కానీ ఎక్కడ కోరుకుంటే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమని అన్నారు. సనత్ నగర్ లో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనమహోత్సవంలో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.