రేవంత్ రెడ్డి విద్యుత్ తీగలు పట్టుకుంటే కరెంట్ ఉందా? లేదా? తెలుస్తుందిః కెటిఆర్

విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు

minister ktr public meeting in kamareddy

హైదరాబాద్ః టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు విద్యుత్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కెటిఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కష్టాలు అందరికీ తెలిసిందే అన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఎక్కడిది? అని ప్రశ్నిస్తున్నారని, కామారెడ్డిలో పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి విద్యుత్ తీగలు పట్టుకుంటే కరెంట్ ఉందా? లేదా? తెలుస్తుందని చురకలు అంటించారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ కష్టాలు తీరాయన్నారు. అందుకే మన వద్ద వరి సాగు పెరిగిందన్నారు. తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నారని, ఈ ఎన్నికల్లో గెలిచాక కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రధాని మోడీకి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలంగాణపై ప్రేమ లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ధరణి ఎత్తేసి… పట్వారీ వ్యవస్థను తీసుకు రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. పట్వారీ వ్యవస్థ వద్దు… ధరణి ముద్దు అనేవారికి ఈసారి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పట్వారీ వ్యవస్థను తీసుకువచ్చి మళ్లీ రైతులు, తెలంగాణ ప్రజల జీవితాలను ఆగం చేస్తారని కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు.

ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇచ్చే కెసిఆర్‌కు ఓటు వేసి… మూడోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టుకోం కదా అంటూ సామెత చెప్పారు. ధరణి తొంబై శాతం బాగుందని, ఆ పది శాతం కూడా సరి చేసుకుందామని చెప్పారు. కెసిఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలు మారిపోతాయన్నారు. తెలంగాణపై కెసిఆర్‌కు ఉండే ప్రేమ రాహుల్ గాంధీ, మోడీలకు ఉంటాయా? అన్నారు. అలాంటి ఢిల్లీ వారిని నెత్తిమీద పెట్టుకుందామా? అని ప్రశ్నించారు. కామారెడ్డికి వస్తున్న కెసిఆర్‌ను ఆశీర్వదించాలని, అప్పుడు ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయన్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడన్నట్లుగా కెసిఆర్ మీ వద్దకు వచ్చాడన్నారు.