మోడీ వ్యాఖ్యల ఫై బిఆర్ఎస్ మంత్రి తలసాని ఫైర్

హైదరాబాద్ పర్యటన లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బిజెపి సభలో మోడీ మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. తెలంగాణలో కేంద్రం చేపడుతున్న అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ..దీనివల్ల ప్రాజెక్టుల పనులు ఆలస్యం అవుతున్నాయని, రాష్ట్రంలో కుటుంబం పాలన అవినీతిని పెంచిపోషిస్తుందని , సొంత కుటుంబం ఎదిగితే చాలు అనుకుంటున్నారని , ఇలాంటివారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మోడీ అన్నారు.

మోడీ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణపై ఆయనకు ప్రేమలేదని, ఇందుకు గతంలో రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. వందే భారత్‌ రైళ్లను మోడీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని మోడీ అన్నారని, కేంద్రం ఏమిచ్చిందని అడ్డుకోవడానికని నిలదీశారు. మోడీ అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాత్రమే మాట్లాడారన్నారు.

అవినీతి గురించి మోడీ మాట్లాడుతున్నారు..అసలు అదానీ అవినీతి సంగతేంటని ప్రశ్నించారు. శ్రీలంకలో అదానీకి వచ్చిన కాంట్రాక్టు ఎవరి ద్వారా వచ్చింది ? అదానీ మోసాలపై జేపీసీ వేయమంటే ఎందుకు వేయరన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి మోడీ నాతో చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి సాధించకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తోందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అవునో కాదో ..? ప్రధాని మోడీనే చెప్పాలన్నారు. 24 గంటల కరెంట్ రాష్ట్రంలో ఉందో లేదో మోడీనే చెప్పాలన్నారు. రెండుకోట్ల ఉద్యోగాల సంగతిపై మోడీ మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.