మోడీ ఫై మండిపడుతున్న బిఆర్ఎస్ నేతలు

హైదరాబాద్ పర్యటన లో తెలంగాణ ప్రభుత్వం ఫై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదానీ వాదం నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకే.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మోడీకే చెల్లింద‌ని మంత్రి హ‌రీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదు.. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్లు ఉందని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

అలాగే మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన మోడీ.. ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని అన్నారు. తెలంగాణాలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా.. బీజేపీ పాలనలో అవినీతిమయంగా మారిందని ఆయన ఆరోపించారు. బీజేపీని ప్రతిఘటిస్తున్నందుకే బీఆర్‌ఎస్‌తో సహా విపక్షాలపై సీబీఐ, ఈడీ, ఐటీ తదితర కేంద్ర సంస్థలను ఎగదోస్తున్నారని ఆరోపించారు. దారికి వచ్చి బిజెపి లో చేరితే మాఫీ.. లేదంటే అక్రమ కేసులతో సతాయించడం ఢిల్లీ పెద్దలకు పరిపాటిగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే ఢిల్లీ పెద్దలకు వణుకు మొదలైందని.. అందులో భాగమే ఈరోజు పర్యటనలో తెలంగాణాపై ప్రధాని మోడీ విద్వేషపు ప్రసంగమంటూ మంత్రి మండిపడ్డారు.

ప్ర‌ధాని మోడీ విభ‌జ‌న హామీలు నెర‌వేర్చకుండా.. రాజ‌కీయ ప్ర‌సంగాలు చేసి వెళ్లిపోయార‌ని మంత్రి సబితా ఇంద్ర రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. దేశ ప్రధాని వస్తే రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందని ప్రజలంతా ఆశిస్తారని తీరా చూస్తే అలాంటిదేమీ ఉండ‌ద‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక‌ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ తెలంగాణ‌ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే, కేంద్రం మాత్రం రాష్ట్రంపై వివక్ష చూపుతుందని మండిప‌డ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్న ప్రధాని మోడీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మీకు ఎందుకు సహకరించాలని ధ్వజమెత్తారు. మా డబ్బులు తీసుకెళ్లి గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్న మీకు మేం సహకరించాలా అంటూ విమర్శించారు. సింగరేణిలో నష్టాలు చూపి బొగ్గు గనులు వేలం వేసిన కుట్ర నిజం కాదా..రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ను రూ.1200 చేసినందుకు మీకు సహకరించాలా అంటూ విరుచుకుపడ్డారు.