రేపటి టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ వాయిదా..!

T-congress-screening-committee-meeting-scheduled-for-tomorrow-has-been-postponed

హైదరాబాద్‌ః రేపు జరగాల్సిన టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది. వచ్చే శుక్రవారం అనగా అక్టోబర్ 06కి సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, ఆలస్యంగా అభ్యర్ధులను ప్రకటించడం వల్లనే ఆశించిన స్థానాలను దక్కించుకోలేకపోయామన్న భావన టీ.కాంగ్రెస్ నేతల్లో వుంది. ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పీసీసీతో పాటు ఏఐసీసీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందుకే అభ్యర్ధుల ఎంపికలో సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. సర్వేల ఆధారంగా గెలిచే అవకాశం లేని వాళ్లకు ఎట్టిపరిస్థితుల్లో సీట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

సామాజిక సమీకరణలకు పెద్ద పీట వేస్తూ.. గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అవసరమైతే బయటి పార్టీల నుంచి వచ్చిన నేతలకైనా .. గెలుస్తారు అనుకుంటే అవకాశం ఇవ్వాలని లెక్కలు వేస్తున్నాయి. ఇందుకోసం సునీల్ కనుగోలు బృందంతో పాటు మరో బృందం సర్వేలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. సర్వేల సమచారం రావడం ఆలస్యం కావడం, గట్టి పోటీ కలిగిన నియోజవకర్గాలకు చెందిన నేతల సమాచారం సేకరించేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు వుండటంతో రేపు జరగాల్సిన స్క్రీనింగ్ కమిటీ భేటీ వాయిదా పడినట్టు సమాచారం.