నేడు ఏపి హైకోర్టు నూతన జడ్జీల ప్రమాణ స్వీకారం

అమరావతిః నేడు ఏపి హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ న్యాయమూర్తులుగా నియమితులైన అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, దుప్పల వెంకటరమరణ, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యామ్ సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, తల్లాప్రగడ మల్లికార్జునరావులతో ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మాతృమూర్తి మరణించడంతో ఆయన కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారు. దీంతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.
కాగా, రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా వై లక్ష్మణరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన జుడీషియల్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు ఆ బాధ్యతలు నిర్వహించిన ఏవీ రవీంద్రబాబు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ స్థానంలో లక్ష్మణరావును నియమించారు. కాగా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన మరో ఇద్దరు రిజిస్ట్రార్లు బీవీఎన్‌ఎల్ చక్రవర్తి (ఐటీ), దుప్పల వెంకట రమణ (అడ్మిన్)ల స్థానంలో రిజిస్ట్రార్ (విజిలెన్స్) గంధం భానుమతి, రిజిస్ట్రార్ (నియామకాలు) ఆలపాటి గిరిధర్ బాధ్యతలు స్వీకరించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/