ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

పూణె మాడ్యూల్ కేసులో అతడు కీలక నిందితుడు

Suspected ISIS Terrorist Arrested By Delhi Police

న్యూఢిల్లీ : ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కీలక ముందడుగు వేశారు. కరుడుగట్టిన ఐఎస్ఐఎస్ (ఐసిస్) ఉగ్రవాది షానవాజ్ అలియాస్ షఫీ ఉజామాను (32) అరెస్ట్ చేశారు. అతడ్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) లోగడే ప్రకటించింది. అతడి తలపై రూ.3 లక్షల రివార్డు ఉంది. పూణే ఐసిస్ మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. పూణే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడి కోసం ఎప్పటి నుంచో వేట కొనసాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీకి చెందిన షఫీ ఉజామా వృత్తి రీత్యా ఇంజనీర్. పూణే కేసులో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడు ఢిల్లీలో తలదాచుకుంటున్నాడు. విదేశాల్లోని వారి ఆదేశాలకు అనుగుణంగా ఉత్తరాదిన ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఐఈడీల తయారీలో వినియోగించే పలుడు పేలుడు పదార్థాలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. షఫీ ఉజామా, మరో ఇద్దరిని పుణె మాడ్యూల్ కేసులో కొత్రూడ్ పోలీసులు జూలై 18న అరెస్ట్ చేశారు. పోలీసు వాహనం నుంచి షఫీ కిందకు దూకేసి తప్పించుకోగా, ఇన్నాళ్లకు మళ్లీ చిక్కాడు.