వరికోనుగోలు విషయంలో కేంద్రం ఫై ఊరూరా నిరసనలు..

వరి కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేంద్రం ఫై ఆగ్రహం గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు తమ నిరసన తెలుపగా..ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా నిరసనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నేడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెరాస నిరసనలు చేయనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.

ఊరూరా చావుడప్పు, ర్యాలీలతో ఆందోళన చేసేందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. భాజపా మోసాలు, నాటకాలు ప్రజలకు తెలిసేలా నిరసనలు సాగాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులకు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మార్గనిర్దేశం చేశారు. ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాసినా, కేంద్రమంత్రులను కోరినా, పార్లమెంటులో నిరసన తెలిపినా.. కేంద్రం నుంచి స్పందన లేదని కేటీఆర్‌ విమర్శించారు. నిరసనలు విజయవంతమయ్యేలా మంత్రులు శ్రేణులను సమాయత్తం చేశారు.

తెరాస ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకనే కేంద్రప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లపై నానా కొర్రీలు పెట్టి రాజకీయ లబ్దిపొందాలని చూస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. తెరాస పోరుకు లారీ యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి లేఖ అందించారు. మరోపక్క రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అలాగే బిజెపి నేతలు సైతం ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ నేత డీకే అరుణతోపాటు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి బయలుదేారారు. రేపు అమిత్ షాతో విడివిడిగా బీజేపీ నేతలు సమావేశం అవుతారని తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వడ్ల కొనుగోలు అంశాలను అమిత్ షా ద్రుష్టికి తీసుకెళ్లనున్నారు.