చైనాలో మరో కొత్త వైరస్‌ వ్యాప్తి

జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి

new-langya-virus-hits-china

బీజింగ్‌ః కరోనా వైరస్‌ చైనాలో పుట్టి మరణ మృదంగం మోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చైనాలో మరో కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. తాజాగా జంతువుల నుంచి వ్యాపించే ‘హెనిపావైరస్‌’… ఇటీవల షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్స్‌ల్లో కొందరికి సోకినట్లు తేలింది. జ్వరంతో బాధపడుతున్న ఈ రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. దీనికి ‘నోవెల్‌ లాంగ్యా హెనిపావైరస్‌’గా పేరుపెట్టారు. ఈ వైరస్‌ సోకిన రోగుల్లో జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఎలుకలు, ఇతర జంతువుల నుంచి ఇది మనుషులకు సోకుతుందని నిపుణులు భావిస్తున్నారు. గొర్రెలు, కుక్కలు వంటి జంతువుల్లోనూ హెనిపా వైరస్‌ను గుర్తించారు.దీన్ని లాంగ్యా హెనిపావైరస్ అని కూడా పిలుస్తారు. ఇది బయోసేఫ్టీ లెవల్‌-4 వైరస్‌గా చెబుతున్నారు. మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. హెనిపావైరస్‌ వ్యాప్తి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. కేవలం లక్షణాలను బట్టి బాధితులకు ఉపశమనం కల్పించే చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌ సోకిన బాధితులను పరిశోధించగా… తీవ్రమైన లక్షణాలు లేవని డ్యూక్‌ ఎన్‌యూఎస్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ వాంగ్‌ లింఫా పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/