ఈ ఘటనలో కేవలం 23 మంది సాక్షులే దొరికారా?

లఖింపూర్ కేసు విచారణలో యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ వద్ద రైతుల ర్యాలీపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు కారుతో దూసుకెళ్లి, రైతుల మృతి కారకుడైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోంది. నేటి విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఘటన సమయంలో నాలుగైదు వేల మంది ఉంటే కేవలం 23 మంది సాక్షులే దొరికారా? అని ప్రశ్నించింది. 164 నిబంధన కింద ఎందరు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారని, సాక్షుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. అందుకు యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే స్పందిస్తూ, 60 మందిని సాక్షులుగా గుర్తించినట్టు వెల్లడించారు. అయితే వారిలో 23 మందే సాక్ష్యం చెప్పేందుకు ముందుకొచ్చారని వెల్లడించారు. ఈ క్రమంలో ధర్మాసనం… గాయపడిన వారెవరైనా సాక్షుల్లో ఉన్నారా అని అడిగింది. కీలక నిందితుల విషయం ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో ఉత్తప్రదేశ్ సర్కారుపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ వేగవంతం చేస్తారా? లేదా? అంటూ ప్రశ్నించింది. విచారణ తీరు ఇలాగే కొనసాగితే ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. సాక్షులకు పూర్తి భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 164 నిబంధన కింద వాంగ్మూలం నమోదు సత్వరమే పూర్తిచేయాలని నిర్దేశించింది. దర్యాప్తులో తగిన నియమావళిని అనుసరించాల్సిందేనని, సాక్షుల వాంగ్మూలాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని స్పష్టం చేసింది. లఖింపూర్ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నమోదైన ఎఫ్ఐఆర్ లపైనా నివేదిక ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అటు, ఫోరెన్సిక్ ల్యాబ్ లు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్న ఆధారాలపై పరిశోధన వేగవంతం చేసి నివేదికలు అందజేయాలని సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశించింది. అనంతరం ఈ కేసును నవంబరు 8కి వాయిదా వేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/