అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలు

రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీ..

Supreme Court orders probe into Adani-Hindenburg row, seeks SEBI’s status report

న్యూఢిల్లీః అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ విడుదల చేసిన సంచలనాత్మక నివేదిక, ఆరోపణల నేపథ్యంలో.. దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలను సెబీ లోతుగా పరిశీలిస్తూ, నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో ఉంది. ఇందులో ఏం గుర్తించారో తమకు రెండు నెలల్లో దర్యాప్తు నివేదిక ఇవ్వాలని కూడా సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నిపుణుల కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్ దర్, కేవీ కామత్, నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ ను సభ్యులుగా సుప్రీంకోర్టు నియమించింది. అదానీ-హిండెన్ బర్గ్ ఎపిసోడ్ కు దారితీసిన అంశాలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పరిశీలిస్తుంది. ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి నియంత్రణ సంస్థ వైపు ఏదైనా వైఫల్యం ఉందా? అన్నది కూడా కమిటీ తేల్చనుంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా చట్టబద్ధమైన, నియంత్రణపరమైన చర్యలను సూచించింది.

అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలకు పాల్పడుతోందని, షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేస్తోందని హిండెన్ బర్గ్ ఆరోపణలు చేయడం గుర్తుండే ఉంటుంది. తీవ్ర ఆరోపణలు కావడంతో అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ సగానికి పైనే నష్టపోయింది. మొత్తానికి ఈ అంశంలో సుప్రీంకోర్టు కమిటీని నియమించడం అత్యంత ముఖ్యమైన పరిణామం కానుంది. కమిటీ నివేదికతో అదానీ గ్రూప్ పై ఉన్న సందేహాలకు సమాధానం లభిస్తుందని ఆశించొచ్చు.