సుప్రీంకోర్టు జడ్జీలుగా ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

32కు పెరిగిన మొత్తం సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః భారత సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు జడ్జీలు కొలువుదీరారు. దీంతో.. సుప్రీం న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 32కు చేరింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట్ సంజయ్ కుమార్‌తో పాటూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదవీబాధ్యతలు స్వీకరించారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం..గతేడాది డిసెంబర్ 13న ఈ ఐదుగురి పేర్లను కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనల విషయంలో కేంద్రం, సుప్రీం కోర్టు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. చివరకు కేంద్రం కొలీజియం ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో తెలుగు వ్యక్తి పమిడిఘంటం శ్రీనరసింహం న్యాయమూర్తిగా ఉన్నారు. తాజాగా జస్టిస్ పులిగోరు వెంకట్ సంజయ్ కుమార్‌ నియామకంతో సర్వోన్నత న్యాయస్థానంలో తెలుగు జడ్జీల సంఖ్య రెండుకు చేరింది.

కొత్త న్యాయమూర్తులు వీరే..

జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌
1963, ఆగస్టు 14న జన్మించారు. తల్లిదండ్రులు పద్మావతమ్మ, రామచంద్రారెడ్డి. వీరిది కడప జిల్లా, అయితే సంజయ్‌కుమార్‌ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నిజాం కాలేజీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1988లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. పి రామచంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అడ్వకేట్‌ జనరల్‌గా 1969-82 మధ్య పనిచేశారు. సంజయ్‌కుమార్‌ 1988లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొన్నారు. 2000-03 మధ్య ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2008 ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అదనపు జడ్జిగా పదోన్నతి పొందిన ఆయన.. 2010, జనవరి 20న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019లో పంజాబ్‌, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్‌ సంజయ్‌కుమార్‌, 2021, ఫిబ్రవరిలో మణిపూర్‌ హైకోర్టు సీజే అయ్యారు.

జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌
1982లో అలహాబాద్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పొందిన జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌.. మీరట్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1985 నుంచి అలహాబాద్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2021, జనవరిలో జమ్ముకశ్మీర్‌ సీజేగా పదోన్నతి పొందారు.

జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌
పాట్నా హైకోర్టు సీజేగా 2019, నవంబర్‌లో నియమితులయ్యారు. అంతకుముందు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. త్రిపుర స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ పాట్రాన్‌-ఇన్‌-చీఫ్‌గా, త్రిపుర జ్యుడీషియల్‌ అకాడమీ చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు.

జస్టిస్‌ ఎహసానుద్దీన్‌ అమానుల్లా

పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా 2011లో నియామకం పొందారు. ఆ తర్వాత 2021లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు.. మళ్లీ 2022, జూన్‌లో పాట్నా హైకోర్టు బదిలీ అయ్యారు. 1963, మే 11న జన్మించిన జస్టిస్‌ అమనుల్లా.. 1991లో బీహార్‌ స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొన్నారు.

జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా
అలహాబాద్‌ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2011లో అలహాబాద్‌ హైకోర్టు అదనపు జడ్జీగా పదోన్నతి పొందారు. 2013లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.