సోషల్ మీడియాలో నకిలీ వార్తలఫై న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన

జియో నెట్ వర్క్ పుణ్యమాని ..ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియా కు బాగా దగ్గరయ్యారు. గతంలో ట్విట్టర్ , పేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ వంటి మాధ్యమాలను సెలబ్రటీస్ మాత్రమే వాడేవారు కానీ..ఇప్పుడు ఫ్రీ నెట్ అందుబాటులోకి రావడం..అతి తక్కువ ధరలకే అత్యధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు ఉండడంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ను వాడుతున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అందులోనే ఉంటున్నారు. దీంతో సోషల్ మీడియా లో అసత్యపు ప్రచారం పెరిగిపోతుంది. రోజు రోజుకు ఫేక్ న్యూస్ వైరల్ అవుతుండడం తో వాటిని నిజమే అనుకోని చాలామంది భయపడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ..సోషల్ మీడియాలో నకిలీ వార్తలఫై ఆందోళన వ్యక్తం చేసారు.

దేశంలో కోవిడ్-19 వ్యాప్తికి తబ్లిగీ జమాత్ సమావేశాలే కారణమని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై సీజేఐ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ హైకోర్టుల్లో దాఖలైన సోషల్ మీడియా కేసులకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేసి విచారించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందించింది. అన్ని పిటిషన్‌లను కలిపి విచారించడంపై నిర్ణయం తీసుకునేందుకు కేసును ఆరు వారాల తర్వాల లిస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీజీఐ ఎన్వీ రమణ సూచించారు.