షూటింగ్‌లో బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీకి గాయాలు

బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ ప్రమాదానికి గురయ్యారు. యాంకర్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన సన్నీ..ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రేజ్ తనకు సినిమా ఛాన్సులు నిండుగా తెస్తాయని అనుకున్నాడు కానీ పెద్దగా ఛాన్సులు రాలేదు. ఒకటి , రెండు సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ‘అన్స్టాపబుల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. డైమండ్ రత్నబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు.

ఈ చిత్రం ప్రమోషనల్‌ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి, వీజే సన్నీ ప్రోమో షూట్‌లో పాల్గొన్నారు. పోలీస్‌ గెటప్‌లో ఉన్న సప్తగిరి రివాల్వర్‌ చూపిస్తూ.. పృథ్విని అన్‌స్టాపబుల్‌ రిలీజ్ ఎప్పుడని అడుగగా.. పృథ్వి తనకు తెలియదని సమాధానం చెప్పాడు. ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చిన వీజే సన్నీపై రివాల్వర్‌ ఎక్కుపెట్టి సప్తగిరి అదే ప్రశ్న అడుగుతాడు. అయితే ఇదే క్రమంలో సప్తగిరి చేతిలో ఉన్న రివాల్వర్‌ పేలి.. అందులో ఉన్న డమ్మీ బుల్లెట్‌ సన్నీ భుజంపై తాకింది. దీంతో గాయమైన వీజే సన్నీని చిత్రయూనిట్‌ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.