కర్ణాటకలో మొదలైన కౌంటింగ్

దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటివిడతలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. ఈసారి 2615 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

బెంగళూరు పరిధిలోని రాజరాజేశ్వరి నగర, శాంతి నగర, చిక్ పేటె, ధార్వాడ లోని స్ట్రాంగ్ రూమ్స్ , బెంగళూరులో మౌంట్ కార్మెల్ కాలేజ్, సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ లను సైతం ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బెంగుళూర్ లో 144 సెక్షన్ విధించారు. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు సందడి చేస్తున్నారు. తమ పార్టీకి పూర్తి మెజారిటీ లభించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.