కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం కొట్టిపారేసిన సునీతా లక్ష్మారెడ్డి

Sunitha Lakshma Reddy denied the campaign of joining Congress

హైదరాబాద్ః ‘మా పార్టీకి, అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉంది, కార్యకర్తలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రచారం’ అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, పరువునష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. మంగళవారం ముఖ్యమంత్రిని కలవడంతో మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం వివరణ ఇచ్చారు.

బుధవారం ఉదయం పార్టీ హెడ్డాఫీసు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోత ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు మాట్లాడారు. అభివృద్ధి పనులకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికే వెళ్లామని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని వివరించారు. ముందు మమ్మల్ని అడిగాకే ప్రజలకు చూపెట్టాలని మీడియాకు సూచించారు.