నియోకోవ్ వైరస్‌..సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన నియోకోవ్ వైరస్

బీజింగ్: కరోనా మహమ్మారి ఉద్ధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతూ జనం ఊపిరి పీల్చుకుంటున్న వేళ చైనా మరో షాకింగ్ ప్రకటన చేసింది. నియోకోవ్ కరోనా వైరస్ రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ గబ్బిలాల నుంచి జంతువులకు సోకుతుందని వూహాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. నియోకోవ్ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

‘బయోఆర్ఎక్స్4’లో వెబ్‌సైట్‌లో ప్రచురితమైన పరిశోధన పత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు రష్యా అధికారిక వార్తా సంస్థ స్పుత్నిక్ ఓ కథనాన్ని ప్రచురించింది. నియోకోవ్ వైరస్‌లోని ఓ మ్యుటేషన్ జంతువుల నుంచి మనుషులకు సోకవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ2)ను నియోకోవ్ వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. అయితే, మనుషుల్లోని ఏసీఈ2ను ప్రభావం చేసి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం నియోకోవ్‌కు కొంత తక్కువగానే ఉందని వూహాన్ యూనివర్సిటీ, బయోఫిజిక్స్ ఆఫ్ ద చైనీస్ అకాడమీ శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనంలో తేలినట్టు కథనం పేర్కొంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/