ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం..టీడీపీ నేతలతో సుజనా భేటీ

ఏపీ రాజకీయాల్లో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి..టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాసానికి రావడం జరిగింది. అలాగే ఈ సమావేశంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ సైతం పాల్గొన్నారు. సమావేశం అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ..వైస్సార్సీపీ ప్రభుత్వం గద్దె దిగితేనే ఏపీకి మంచి రోజులు వస్తాయని అన్నారు.

అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వైస్సార్సీపీ కి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెపుతారని..అది ఇంకెన్నో రోజులు లేవని అన్నారు. ఇకనైనా జగన్ తీరు మార్చుకుంటే మంచిదని సుజనా హితవు పలికారు. అలాగే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతుందేమోనన్న ఆందోళన ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.