ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు..విద్యార్థులకు పలు సూచనలు

tenth-class-exams

ఏప్రిల్ 03 నుండి ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలుకానున్న నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు తెలియజేసారు. పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తాయన్నారు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు వారిని పరీక్ష హాలులోకి అనుమతిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, కెమెరా, ఇయర్‌ఫోన్స్, స్పీకర్, స్మార్ట్‌ఫోన్, బ్లూటూత్ సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టం చేసారు.

ఏప్రిల్ 3న గ్రూప్‌ ఏ విభాగంలో ఫస్ట్‌ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. రెగ్యులర్‌ విద్యార్ధులకు 10మార్కులకు, ఫస్ట్‌ లాంగ్వేజ్ కంపోజిట్‌ కోర్సులకు 70మార్కులకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 6వ తేదీన సెకండ్ లాంగ్వేజ్‌ పరీక్ష జరుగుతుంది. ఏప్రిల్ 8న ఇంగ్లీష్, ఏప్రిల్ 10వ తేదీన లెక్కలు, ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం, ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్‌ పరీక్షలు జరుగుతాయి.

ఏప్రిల్‌ 17న కంపోజిట్‌ కోర్సుల్లో ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్‌ 2 పరీక్ష జరుగుతుంది. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 11.15 గంటల వరకు 30మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. ఓరియంటల్ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో భాగంగా ఏప్రిల్‌ 17న సంస్కృతం, అరబిక్‌, పర్షియన్ కోర్సుల్లో 100మార్కుల పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనుంది.

ఏప్రిల్ 18న ఓరియంటల్ లాంగ్వేజ్ కోర్సుల్లో మెయిన్ లాంగ్వేజ్ పేపర్‌ 2 పరీక్షను సంస్కృతం, అరబిక్‌, పర్షియన్ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేషనల్ కోర్సుల్లో థియరీ పరీక్షలు కూడా అదే రోజు జరుగుతాయి. పరీక్ష ముందుగానే రాసేసినా సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలులోనే ఉండాలి. విద్యార్థులు తమ రోల్ నంబరు, పేరు లాంటి వ్యక్తిగత వివరాలను సమాధాన పత్రంలో రాయకూడదు. వాటిని ఓఎంఆర్ షీటులోనే రాయాలి. విద్యార్థులు పెన్, పెన్సిల్, స్టేషనరీని వెంట తెచ్చుకోవచ్చు.