నారా లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కు బ్రేక్ పడింది. గత 40 రోజులుగా లోకేష్ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను అడిగితెలుసుకుంటూ వస్తున్నారు. 40 రోజుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించారు. మొత్తం 520 కిలోమీటర్ల మేర నడిచారు. ఈ పాదయాత్రలో ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఈరోజు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా పాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు. రేపు, ఎల్లుండి పాదయాత్రకు విరామం ప్రకటించనున్న నారా లోకేష్.. ఈ నెల 14న మళ్లీ యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు.

నిన్న 40వ రోజు యాత్ర మదనపల్లిలోని క్యాంప్‌ సైట్‌ నుంచి ప్రారంభమైంది. లోకేష్‌ 6వ వార్డులో స్థానికులతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బర్మా సర్కిల్‌లో స్థానికులతో ఆయన భేటీ అయ్యారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అన్నమయ్య నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. వైస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సాయంత్రం లోకేష్‌ పాదయాత్ర మదనపల్లి నియోజకవర్గంనుంచి తంబళ్లపల్లి నియోజకవర్గంలోకి చేరుకుంది.