భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత

భద్రాచలంలో నర్సింగ్‌ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థిని మరణానికి నిరసనగా కాలేజీ ఎదుట ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని.. నర్సింగ్‌ కాలేజీని సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. విద్యార్థిని కారుణ్య మృతి విషయం తెలుసుకున్న MLA తెల్లం వెంకట్రావ్ కాలేజీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడారు. నిందితుల తరఫున వచ్చారా అని విద్యార్థి సంఘాలు ఆయనను నిలదీశాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. కారుణ్య కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేందుకు MLA యత్నించినా వారు వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు.

పగిడిపల్లి కారుణ్య (17) బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నది. గురువారం తెల్లవారుజామున 3:40 గంటలకు ఓ విద్యార్థిని బాత్‌రూం వెళ్లేందుకు బయటకు రాగా కారుణ్య కళాశాల ఆవరణలో రక్తపు గాయాలతో పడి ఉన్న విషయాన్ని గమనించి తోటి విద్యార్థినులతో కలిసి హాస్టల్‌ వార్డెన్‌కు తెలిపింది. వెంటనే 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 8.30 గంటలకు మృతి చెందినట్టు ఎస్సై విజయలక్ష్మి తెలిపారు.

దవాఖాన వద్ద కారుణ్య తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగగా గిరిజన, దళితసంఘాల నాయకులు మద్దతు పలికారు. భద్రాచలం ఏఎస్పీ దవాఖాన వద్దకు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా కారుణ్య శరీరంపై గాయాలు ఉండటంతో విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కాలేజీ వద్దకు చేరుకున్న మృతురాలి బంధువులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.