తాజ్‌మహల్‌ సందర్శన ప్రారంభం

Taj Mahal re-opens for public after six months with COVID-19

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ ఈరోజు నుండి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. కరోనా వైరస్ కారణంగా మూతపడిన ఈ ప్రేమ చిహ్నం… సోమవారం తిరిగి తెరచుకుంది. కాగా ఇప్పటి వరకు 160 టికెట్లు బుక్‌ అయ్యాయని, చైనాకి చెందిన పర్యాటకుడు లియాంగ్ జి చెంగ్ మొదటి టికెట్ బుక్ చేసుకున్నాడని పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. కాగా తాజ్ మహల్ సందర్శనకు రోజుకు 5వేల మందికి మించకుండా పర్యాటకుల్ని అనుమతిస్తారు.

అలాగే… ఆగ్రా కోటను రోజుకు 2500 మంది మాత్రమే చూసే వీలుంది. రెండు కట్టడాలకూ టికెట్ ఇచ్చే కిటికీ మూసి ఉంటుంది. టూరిస్టులు భారత పురావస్తు శాఖ (ASI) వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తాజ్‌మహల్, ఆగ్రా కోట దగ్గర ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ (Standard Operating Procedure-SOP) తప్పక పాటించాలని అధికారులు తెలిపారు. సమాధులు ఉండే గదిలోకి ఒకసారి ఐదుగుర్ని మాత్రమే అనుమతిస్తారు. అక్కడ షా జహాన్, ముంతాజ్ సమాధులు ఉంటాయి. మ్యూజియం కూడా పర్యాటకుల కోసం తెరిచారు. కట్టడాల దగ్గర తప్పనిసరిగా సేఫ్ డిస్టాన్స్ పాటించాలి, మాస్కులు ధరించాలి. కట్టడాల గోడలు, రెయిలింగ్స్‌కి దూరంగా ఉండాలి. షూ కవర్, వాటర్ బాటిల్, టిష్యూ పేపర్ల వంటివి డస్ట్ బిన్లలో మాత్రమే వెయ్యాలి. టూరిస్టులు లోపలికి ఎంటర్ అయ్యే ముందే థెర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. కరోనా లక్షణాలు లేని పర్యాటకుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/