మరోసారి వందే భారత్‌ రైలుపైరాళ్ల దాడి.. కిటికీ అద్దం ధ్వంసం

Stones Thrown At Vande Bharat Express In Odisha, None Hurt

న్యూఢిల్లీః వందే భారత్‌ రైలు పై దాడులు కొనసాగుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు. తాజాగా వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. రౌర్కెలా – పూరీ మధ్య నడిచే వందే భారత్‌పై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దెంకనల్‌ – అంగుల్‌ రైల్వే సెక్షన్‌లోని మెరమండలి – బుధపాంక్‌ స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అధికారులు సోమవారం వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌ కిటికీ ధ్వంసమైనట్లు తెలిపారు. ఈ ఘటనతో 13 నిమిషాలు ఆలస్యంగా రైలు పూరీ చేరుకున్నట్లు తెలిపారు. ‘ట్రైన్‌ నంబర్‌ 20835 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై కొందరు రాళ్ల దాడి చేశారు. భువనేశ్వర్‌ – సంబల్‌పూర్‌ రైలు మార్గంలోని దెంకనల్‌ – అంగుల్‌ రైల్వే సెక్షన్‌లో మెరమండలి -బుధపాంక్‌ మధ్య కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌ కిటికీ ధ్వంసమైంది’ అని ఓ ప్రకటనలో వెల్లడించారు.

మరోవైపు ఈ ఘటనను రైల్వే అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.