రిషబ్ పంత్ ను ముంబై హాస్పటల్ కు తరలింపు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ ను డెహ్రాడూన్ నుండి ముంబై హాస్పటల్ కు తరలిస్తున్నారు. గత శుక్రవారం పంత్ నడుపుతున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురవడం తెలిసిందే. మోకాలులో లిగమెంట్ కట్ అయిపోవడంతోపాటు, నుదురు, వీపుపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతడికి డెహ్రాడూన్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.

మెరుగైన చికిత్స కోసం పంత్ ను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిసిసిఐ ప్యానల్ వైద్యులు రిషబ్ పంత్ వైద్య రిపోర్టులను పరిశీలించి.. తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా అవసరమైతే మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని విదేశాలకు తరలించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పంత్ కు అన్ని రకాల వైద్య సదుపాయాలను అందించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం డెహ్రాడూన్ నుండి ముంబైలోని కోకిలబెన్ అంబానీ ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు స్పెషల్ గా ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసింది. మరోవైపు చికిత్సతో పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు అన్నది తాజా సమాచారం. పంత్ త్వరగా కోలుకోవాలని తోటి క్రికెటర్లు, అభిమానులు సైతం కోరుకుంటున్నారు.