బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు.. సీసీటీవీ వీడియో రిలీజ్‌

Suspect Had Rava Idli And Left The Bag.. Bengaluru Cafe Owner To NDTV On Blast

బెంగళూరుః తమ కేఫ్‌లో బాంబు పెట్టిన నిందితుడిని తాను సీసీటీవీ ఫుటేజీలో చూశానని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు తెలిపారు. పేలుడు పదార్థాలు నింపిన బ్యాగ్‌ను నిందితుడు రెస్టారెంట్‌లో ఉంచడానికి ముందు రవ్వ ఇడ్లీ తీసుకున్నాడని పేర్కొన్నారు. పేలుడు జరిగినప్పుడు మొబైల్ తన వద్ద లేదని, ఆ తర్వాత అందులో మిస్డ్ కాల్స్ చూసి సిబ్బందికి కాల్ చేస్తే పేలుడు జరిగినట్టు చెప్పారన్నారు.

వంట గదిలో పేలుడు జరిగిందని తొలుత అనుకున్నానని, కానీ అక్కడ పేలుడు జరిగిన ఆనవాళ్లు లేవని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన తర్వాత మాస్క్, మఫ్లర్ ధరించిన వ్యక్తి బిల్లింగ్ కౌంటర్‌ వద్దకు వచ్చి రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్టు కనిపించిందని దివ్య తెలిపారు. ఓ మూలన కూర్చుని ఇడ్లీ తిన్న తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లేముందు బ్యాగును ఓ మూల పెట్టాడని వివరించారు.

ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో అక్కడ సిలిండర్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని దివ్య పేర్కొన్నారు. ప్రాణనష్టం జరగనందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్టు చెప్పారు. త్వరలోనే కేఫ్ అందుబాటులోకి వస్తుందని, మరింత భద్రతా వ్యవస్థతో పనిచేస్తుందని వివరించారు.