గులాబీమయంగా మారిన నాందేడ్ జిల్లా కేంద్రం

మహారాష్ట్రలోని నాందేండ్‌లో నేడు బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. గురుగోవింద్ సింగ్ మైదానంలో నేటి మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, నలు దిశలా, ఎయిర్‌పోర్ట్ నుంచి సభా వేదిక వరకు దారిపోడవునా గులాబీ తోరణాలు, కేసీఆర్ ప్లెక్సీ లతో గులాబీమయంగా మారింది. ఇక సభా వేదికతోపాటు, పార్కింగ్, మీడియా గ్యాలరీలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. దాదాపు 25 వేల మందికిపైగా కూర్చునేందుకు వీలుగా టెంట్‌ను వేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా జనాన్ని తరలించనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు నాందేడ్‌కు చెందిన నాయకులతోపాటు, సభ నిర్వహణ ఏర్పాట్లను ఆది నుంచి పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు భారీగా ఏర్పాట్లు చేశారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ బీబీ పాటిల్‌తోపాటు పలువురు నాయకులు సైతం నాందేడ్‌కు తరలివస్తున్నారు.
ఇక సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ చూస్తే..
హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌గా బయలుదేరి సభా వేదిక సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి చారిత్రక గురుద్వారాను సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
అక్కడి నుంచి 1.30 గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతారు.
అనంతరం బీఆర్‌ఎస్ నాందేడ్ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగం.
2.30 గంటలకు సభాస్థలి నుంచి స్థానిక సిటీ ప్రైడ్ హోటల్‌కు చేరుకుంటారు.
భోజనానంతరం 4 గంటలకు జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు.
5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.