కోడుమూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో అధికారపార్టీకి సొంత నేతల నుండి వరుస తలనొప్పులు ఎదురువుతున్నాయి. రోజు రోజుకు అసమ్మతి సెగ ఎక్కువైపోతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుస పెట్టి నేతలు అధిష్టానం ఫై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటీకే ఆనం , కోటంరెడ్డి వంటి ఎమ్మెల్యేలు పలు ఆరోపణలు చేయగా..తాజాగా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు.

శనివారం కర్నూలు జిల్లాలోని ఉల్చాలలో ‘గడపగడపకు’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే సుధాకర్‌పై ఆ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు బుర్ర పెద్ద వెంకటేశ్ నాయుడు విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వాళ్లను మీరు పక్కనపెట్టారని, మీరు నమ్మక ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు టికెట్ ఇప్పించేందుకు కష్టపడిన వారందరినీ పక్కనపెట్టేశారని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కించుకున్నారని, ఇంతటి నమ్మక ద్రోహం చేస్తారని అనుకోలేదని మండిపడ్డారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలతో నొచ్చుకున్న సుధాకర్.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. సుధాకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీ లో చర్చ గా మారాయి.