టాలీవుడ్ లో మరో విషాదం : ప్రముఖ గేయ రచయిత కన్నుమూతటాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విషాదాలు ఆగడం లేదు. గత డిసెంబర్ లో ప్రముఖ నటులను పోగొట్టుకున్న పరిశ్రమ..ఇక కొత్త ఏడాది కూడా అదే కొనసాగుతుంది. తాజాగా ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. తెలుగులో పలు హిట్‌ చిత్రాలకు పాటల రచయితగా పనిచేసిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. విశాఖపట్నం జిల్లా భీముని పట్నానికి చెందిన పెద్దాడమూర్తికి చిన్నప్పటి నుంచి వేటూరి పాటలంటే బాగా ఇష్టం. గేయ రచయితగా మారాలని కూడా అనుకున్నారు. అయితే భిన్నంగా జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు.

పలు ప్రముఖ పత్రికల్లో పాత్రికేయుడిగా విధులు నిర్వర్తించారు. దర్శకుడు కృష్ణవంశీతో పరిచయం ఉండడంతో హైదరాబాదుకు వచ్చి కొన్ని సినీ పత్రికల్లో పనిచేశాడు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సహాయంతో మొదటిసారిగా కూతురు అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇడియట్‌, మధుమాసం, చందమామ, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పౌరుడు, కౌసల్య సుప్రజ రామ, అది నువ్వే, నాకూ ఓ లవ్వర్‌ ఉంది తదితర తెలుగు సినిమాల్లో పాటలు రాశారు. అమ్మానాన్న ఓ తమిళమ్మాయిలో నీవే నీవే, ఇడియట్ లో చెలియా చెలియా వంటి పాటలు పెద్దాడమూర్తికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. పెద్దాడ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.