ఎస్టీలకు కేసీఆర్‌ దసరా కానుక..గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంచుతూ జీవో జారీ

గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంచుతామని చెప్పినట్లే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచి..దసరా వేళ వారిలో ఆనందం నింపారు. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి జీవో నంబర్‌ 33 జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో గిరిజనులకు శనివారం నుంచి కొత్త రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి.

ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రకటించారు. సెప్టెంబర్‌ 17వ తేదీన ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభించిన సందర్భంగా ఈ అంశంపై మరోసారి విస్పష్ట ప్రకటన చేశారు. గత ఎన్నికల సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం గిరిజనులకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే.

రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపుపై విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎస్‌ చెల్లప్ప నేతృత్వంలో కమిషన్‌ కూడా వేశారు. ఈ కమిషన్‌ ఇచ్చిన నివేదికను 2017లో ఏప్రిల్‌ 15న రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఆ తర్వాతి రోజే శాసనసభలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఏళ్లు గడుస్తున్నా… కేంద్రం సాగదీత ధోరణి అవలంభిస్తుడంతో స్వయంగా రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ ఈ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్తూనే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీనికి అవకాశం కల్పించింది. తమిళనాడు రాష్ట్రంలో సైతం 69శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.