నేటి నుండి ఏపీలో ‘వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు’, ‘షాదీ తోఫా’ పథకాలు అమలు

నేటి నుండి ఏపీలో ‘వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు’, ‘షాదీ తోఫా’ పథకాలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన జగన్ సర్కార్.. ఇప్పుడు వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను తీసుకొచ్చింది. ఈరోజు (అక్టోబర్ 1) నుండి రాష్ట్రంలో ఈ పథకాలు అమల్లోకి వచ్చాయి. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ.1.2 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు, షాదీ తోఫాలో ముస్లిం, మైనార్టీలకు రూ.లక్ష, వికలాంగుల వివాహానికి రూ.1.5 లక్షలు అందించనున్నారు. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్‌ సర్కార్‌ అమలు చేయనుంది.

కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేశామని నేతలు వెల్లడించారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి లక్షా 20 వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. దివ్యాంగులకు ఈ పథకం కింద రూ.1.5 లక్షలు ప్రోత్సాహకంగా అందించనున్నారు. అయితే, ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకం పొందేందుకు వధూవరులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. అమ్మాయి వయసు 18 ఏళ్లు నిండాలి.. అబ్బాయికి 21 ఏళ్లు నిండాలి. గ్రామాల్లో ఆదాయం నెలకు 10 వేలు పట్టణాల్లో అయితే నెలకు 12 వేలకు మించకూడదు. వారి ఇళ్ళలో నెలవారి విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటకూడదు. అలాగే కుటుంబంలో ఇన్ కమ్ టాక్స్ పేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. బాల్య వివాహాల నివారణ, చదువులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు సీఎం జగన్ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవసరమైతే వాలంటీర్ల సాయం తీసుకోవచ్చునని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వర్తించనుంది. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో ఈ పథకం వర్తిస్తుంది.