ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెట్టిన కేటీఆర్

హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ తో నగర వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో, ఫ్లైఓవర్స్, స్కై సిటీస్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ఫ్లైఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చి నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించగా… ఈరోజు ఎల్బీనగర్‌లో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో.. ఎల్బీనగర్‌ జంక్షన్ సిగ్నల్‌ ఫ్రీగా మారింది. ఓ ఫ్లైఓవర్‌, 2 అండర్‌పాస్‌లు గతంలోనే అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన 35వ ప్రాజెక్టును ప్రారంభించామని, మరో 12 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే 12 పనులు చేపట్టామని, ఇప్పటికే 9 ప్రాజెక్టులు పూర్తికాగా.. మిగతా 3 ఫ్లై ఓవర్లను సెప్టెంబరు లోపు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. మెట్రోను దిల్‌సుఖ్‌నగర్‌ లైన్‌తో అనుసంధానం చేస్తాంమని, ఎన్నికల తర్వాత మెట్రోను హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తామన్నారు. ఎల్బీనగర్‌ మెట్రో మార్గాన్ని విమానాశ్రయంతో అనుసంధానించబోతున్నట్లు తెలిపారు. అలాగే ఎల్బీనగర్‌ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎల్బీనగర్ జంక్షన్ ఫ్లై ఓవర్ కు మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్ అని నామకరణం చేస్తున్నామని వెల్లడించారు.