కరోనా ఫై హైఅలర్ట్‌ ప్రకటించిన కేంద్రం

కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. పోయిందాలే అని ఎప్పటికప్పుడు అనుకుంటూ వస్తున్నప్పటికీ..ఆ మాయదారి మహమ్మారి మాత్రం మనుషుల ప్రాణాలను వదలడం లేదు. తాజాగా మరోసారి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం తో కేంద్రం అలర్ట్ ప్రకటించింది. ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు హెచ్చరికాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే సోమవారం రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది.

ఏప్రిల్‌ 10, 11వ తేదీల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు నమోదుకాగా, వైరస్‌ కారణంగా ఆరుగురు మృతి చెందారు. చాలా రోజుల తర్వాత కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 146 రోజుల తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గత ఐదువారాల్లో దేశంలో కేసులు తొమ్మిది రెట్లు పెరిగాయన ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోర్‌ ‘టీ’ (టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌-టీకా)పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది.

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అయితే, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆందోళన కలిగించే పరిస్థితులేమీ లేవని స్పష్టం చేసింది. కరోనాతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని వివరించింది. ఇన్ ఫ్లుయెంజా వ్యాధులు కూడా ఇప్పుడే ప్రబలుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పరిస్థితులను సమీక్షించి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేయాలని సూచించింది.