300 వస్తువుల దిగుమతిపై నిషేధం విధించిన శ్రీలంక

Sri Lanka Bans Import Of 300 Items To Stabilise Economy

కోలంబోః శ్రీలంక విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలను చేస్తున్నది. ఇందులో భాగంగా శ్రీలంక ప్రభుత్వం చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్‌, షాంపూలు తదితర 300 వస్తువుల దిగుమతిని నిషేధించింది. స్వాతంత్య్రం సాధించిన అనంతరం తొలిసారిగా ఈ ద్వీప దేశం సంక్షోభంలో చిక్కుకున్నది. అధ్వాన్న స్థితికి చేరిన ఫారెక్స్‌ నిల్వల కారణంగా నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి జనం భారీ నిరసన ప్రదర్శనలకు దిగారు.

చివరకు గొటబయ రాజపక్స ప్రభుత్వం సైతం దిగిపోయాల్సిన పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే. శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రత్యేక నోటిఫికేషన్‌లో చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్‌, మేకప్‌, షాంపూలతో అనేక రకాల ఉత్పత్తులు సహా మొత్తం 300 వస్తువుల దిగుమతిపై నిషేధం విధించినట్లు పేర్కొంది. ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయంటూ పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నది. ఇప్పటికే లంక అధికారులు ఐఎంఎఫ్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఐఎంఎఫ్‌ ప్యాకేజీ అందుబాటులోకి వస్తుందని శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ నందలాల్‌ వీరసింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/