బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడం కేసీఆర్ గొప్పతనంగా భావిస్తున్నారా..? – జీవిత రాజశేఖర్

బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడం కేసీఆర్ గొప్పతనంగా భావిస్తున్నారా..? అని ప్రశ్నించారు బిజెపి నేత జీవిత రాజశేఖర్. బండి సంజయ్ అరెస్ట్ ఫై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ని అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన చేపట్టిన పాదయాత్ర ను కూడా ఆపేయాలని నోటీసులు జారీ చేయడం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు. లిక్కర్ స్కామ్ తో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో దానిని మళ్లించడానికే బండి సంజయ్ ని అరెస్ట్ చేసారని ఆరోపిస్తున్నారు.

ఇక ఈరోజు కరీంనగర్‌లో బండి సంజయ్ చేపట్టిన దీక్షలో జీవిత రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటోందని.. తెలంగాణ రాక ముందుకు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత?… ఇప్పుడు ఎంత ఉన్నాయో చెప్పే ధైర్యం ఉందా? అని నిలదీశారు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున కల్వకుంట్ల తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కవిత, కేటీఆర్ వ్యాపారస్తులను బెదిరించి కమిషన్లు దండుకుంటున్నారని జీవిత ఆరోపించారు. హైదరాబాద్‌లో అన్ని క్లబ్బులు, పబ్బుల్లో కేటీఆర్‌కు వాటాలు ఉన్నాయని, వాటి యజమానులే పలు సందర్భాల్లో తనకు ఈ విషయం చెప్పారని జీవిత తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఓడిపోవడం ఖాయమని జీవిత అన్నారు.