ఎలాన్ మస్క్ స్టార్ షిప్ ప్రయోగం విఫలం

ఎలాన్ మస్క్ స్టార్ షిప్ ప్రయోగం విఫలం అయ్యింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్‌ నింగిలోకి ఎగిసిన కాసేపటికే పేలిపోయింది. ఇలాంటి పరీక్షల నుంచి తాము చాలా నేర్చుకుంటామని స్పేస్ ఎక్స్ తెలిపింది. ఇదే విజయాన్ని అందజేస్తుందని పేర్కొంది. గతంలో సాంకేతిక కారణాలతో ఈ పరీక్ష వాయిదా పడింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే అది పేలిపోయిందని కంపెనీ వెళ్లండించింది. తదుపరి పరీక్షకు సంబంధించి బృందం డేటాను సేకరించి సమీక్షిస్తున్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది.

అంతరిక్ష రంగంలో గొప్ప మలుపు అనుకున్న ప్రయోగం విఫలమయింది. టెక్సాస్‌లోని లాంచ్ ప్యాడ్‌ నుంచి దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. స్టార్ షిప్ ఆకాశంలోకి ఎగిరిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. రాకెట్ లిఫ్ట్ ఆఫ్, బూస్టర్ వేరుపడటం, మళ్లీ అది భూమికి చేరుకోవడంపైనే దీని భవిష్యత్తు ఆధారపడి ఉందని స్పెస్ ఎక్స్ ప్రయోగానికి ముందు వివరించింది. కానీ లిఫ్ట్ ఆఫ్ అయిన వెంటనే పేలిపోవడంతో స్పేస్ ఎక్స్ కు భారీ నష్టం జరిగింది.

మస్క్ యాజమాన్యంలోని స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్టార్ షిప్.. సూపర్ హెవీ స్పేస్ షిప్. అంతరిక్షంలోకి భారీ పేలోడ్స్‌ను తీసుకెళ్లడంతో పాటు కుజగ్రహంపైకి మనుషులను కూడా పంపించడానికి ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడేది. అంతరిక్ష పరిశోధనలను ఈ స్పేస్ షిప్ మలుపు తిప్పగలదని అనుకున్నారు. అన్ని రకాల పరీక్షలు చేసి.. ప్రయోగించినా ఫలితం విరుద్ధంగా వచ్చింది. ఫాల్కన్ 9 రాకెట్ల తయారీకి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే ఈ స్టార్ షిప్ సూపర్ హెవీ నిర్మాణానికీ వినియోగించారు. ఎన్నిసార్లయినా దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడానికి వీలుగా తీర్చిదిద్దారు. హెవీ పేలోడ్స్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టాలనేది దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా- చంద్రుడితో పాటు ఇతర గ్రహాలపైకి మనుషులను సైతం చేరవేసేలా ఈ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసినట్లు స్పేస్ ఎక్స్ వెల్లడించింది. కానీ ప్రయోగం విఫలమయింది.