ముగిసిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఈవోఐ బిడ్జింగ్‌ గడువు..పాల్గొనని తెలంగాణ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఈవోఐ బిడ్జింగ్‌ గడువు ముగిసింది. గత నెల 27న విడుదలైన ఈవోఐ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చని ఆహ్వానించారు. 22 కంపెనీలు బిడ్‌లు దాఖలు చేసినట్టు సమాచారం. కాగా బిడ్‌ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామ ని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన తెలంగాణ సర్కారు చివరి నిమిషం ఉసూరుమనిపించింది.

7 విదేశీ సంస్థలు ఈవోఐ దాఖలు చేశాయని కార్మిక నేత అయోధ్య రామ్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆసక్తి చూపినట్టు సమాచారం లేదని తెలిపారు. ఎన్ఎండీసీ వంటి కేంద్ర సంస్థలు కూడా ఈవోఐ దాఖలు చేయలేదని అయోధ్యరామ్ పేర్కొన్నారు. కాగా, విశాఖ ఉక్కు పరిశ్రమ ఈవోఐ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్లాంట్ మళ్లీ గాడిన పడేందుకు నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు ఖర్చు చేస్తే చాలని, ఆ మొత్తాన్ని తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరిస్తామని లక్ష్మీనారాయణ వెల్లడించడం చర్చనీయాంశం అయింది.

ఈవోఐ (EOI)ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేకపోవడంతో కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారంటూ భారీ ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ఉత్తదేనని తేలిపోయింది.