మే 31కి కేర‌ళ తీరానికి చేరనున్న నైరుతీ రుతుప‌వ‌నాలు: ఐఎండీ

Southwest Monsoon to reach Kerala coast by May 31: IMD

న్యూఢిల్లీ: భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ ముఖ్య‌మైన అప్‌డేట్ ఇచ్చింది. నైరుతీ రుతుప‌వ‌నాలు .. కేర‌ళ తీరాన్ని మే 31వ తేదీ వ‌ర‌కు చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ పేర్కొన్న‌ది. నాలుగు రోజులు ముందుగానీ, లేక ఆల‌స్యంగా కానీ నైరుతీ రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లోకి ఎంట‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది. జూన్ నెల‌లో వ‌ర్షాలు విస్తారంగా కురిసే ఛాన్సు ఉన్న‌ట్లు ఐఎండీ తెలిపింది.

మ‌రో వైపు ప‌శ్చిమ రాష్ట్రాల‌కు హీట్‌వేవ్ వార్నింగ్ ఇచ్చింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఢిల్లీ, పంజాబ్‌, యూపీ రాష్ట్రాల్లో తీవ్ర‌మైన ఎండ‌లు ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. కొన్ని రాష్ట్రాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేశారు. ఈ రాష్ట్రాల్లో తీవ్ర‌మైన వ‌డ‌గాలులు ఉన్నాయి.

ప్ర‌స్తుతం కేర‌ళ‌లోని కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు ఐఎండీ తెలిపింది. తిరువనంత‌పురంలో మంగ‌ళ‌వారం రాత్రి నుంచి వ‌ర్షం కురుస్తోంది. తిరువ‌నంత‌పురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏక‌ధాటిగా వ‌ర్షం ప‌డుతూనే ఉన్న‌ది. పాతాన‌మిట్ట‌, ఇడుక్కీ జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. మ‌రో 8 జిల్లాల్లో ఆరెంజ్ అల‌ర్ట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం కేర‌ళ తీరం వెంట ఫిషింగ్ బ్యాన్ చేశారు.