ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. గత నెల రోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఇటీవల కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తాజాగా ఏపీలోకి ప్రవేశించాయని తెలిపింది. ఆదివారం నాడు తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.

తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, కర్ణాటకలోని శివమొగ్గ, హాసన్‌ ప్రాంతాలతో పాటు ఏపీలో తిరుపతి జిల్లాలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రాగల 24 గంటల్లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాల రాకతో రాయలసీమతో పాటు సరిహద్దుగా ఉన్న తమిళనాడు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క తెలంగాణ లో తొలకరి జల్లు పడడం తో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.