త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు – సీఎం రేవంత్

తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి..తనదైన మార్క్ కనపరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్..త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు నియమిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లాలవారీగా సమావేశాల నిర్వహణలో భాగంగా మంగళవారం ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నేతలతో ఆయన సమీక్షలు జరిపారు.

సభాపతి ప్రసాద్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని.. అవి సక్రమంగా ప్రజలకు చేరేలా చూడాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దన్నారు. నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియోజకవర్గాల్లో నియమించుకోవాలని, అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని ఆయన స్పష్టంచేశారు.