సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు

Sonia Gandhi

హైదరాబాద్‌ః సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. రేపు జరగబోయే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని.. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. రేపు జరిగే ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా ఈ టూర్ విషయంలో తన వ్యక్తిగత వైద్యుడి సలహా కోరారు. సోనియా ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రయాణం మానుకుంటేనే మేలని వైద్యుడు చెప్పడంతో తెలంగాణ టూర్ ను ఆమె రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడంలేదని ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, జూన్ 02, 2024న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు.