ఉదయం 11 గంటల వరకూ 26.3 శాతం మేర పోలింగ్‌

Phase 7 Voter Turnout.. 26.3% tunout till 11 am, Himachal Pradesh

న్యూఢిల్లీః దేశంలో లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. ఏడో విడతలో భాగంగా చివరి దశ పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. మొత్తం 57 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకూ 26.3 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఉదయం 11 గంటల వరకూ హిమాచల్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా 31.92 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. బీహార్‌లో 24.25 %, చండీగఢ్‌లో 25.03 %, జార్ఖండ్‌లో 29.55 %, ఒడిశాలో 22.64 %, పంజాబ్‌లో 23.91 %, ఉత్తరప్రదేశ్‌లో 28.02 %, పశ్చిమ బెంగాల్‌లో 28.10 % మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఈ దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3 స్థానాలతో పాటు చండీగఢ్‌ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. వీటితో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 42 స్థానాలకు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగుతున్నాయి. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వెలువడుతాయి.

ఈ దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో అత్యధికంగా పంజాబ్‌లో 328 మంది, ఉత్తరప్రదేశ్‌లో 144 మంది, బీహార్‌ 134, ఒడిశా 44, జార్ఖండ్‌ 52, హిమాచల్‌ప్రదేశ్‌ 37, చండీగఢ్‌లో 19 చొప్పున బరిలో ఉన్నారు. కాగా, శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో మూడు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.