మరోసారి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Bomb threat to Indigo flight once again

ముంబయి : ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో చెన్నై నుంచి ముంబయి వెళ్తున్న విమానం ముంబయి లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం ఉదయం ఇండిగో 6E 5314 5314) విమానం 172 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి ముంబై వెళ్తున్నది. ఈ క్రమంలో బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో అప్రమత్తమైన సిబ్బంది ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. విమానంలో నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. ప్రొటోకాల్‌ ప్రకారం విమానాన్ని ఐసోలేషన్‌ బేకు తరలించి తనిఖీలు చేస్తున్నారు.

‘ప్రయాణికులందరిని సురక్షితంగా విమానం నుంచి ఖాళీ చేయించాం. ప్రస్తుతం విమానం తనిఖీలో ఉన్నది. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్‌ ప్రాంతంలో తిరిగి ఉంచుతాం’ అని ఎయిర్‌లైన్‌ ప్రకటించింది. కాగా, వారం రోజుల వ్యవధిలో ఇండో విమానానికి బాంబు బెదిరింపులు రావడం ఇది రెండో సారి.

మే 28న ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. గత మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరాల్సి ఉన్నది. అయితే టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా బాత్రూమ్‌లో ఓ టిష్యూ పేపర్‌పై బాంబు అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా కిందికి దించేశారు. అనంతరం ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నకిలీ బెదిరింపులని గుర్తించారు.