మ‌హిళా బిల్లును త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాలి : సోనియా

Sonia Gandhi Speaks During Debate On Women’s Quota Bill

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ప్రారంభమైన చర్చలో ఆమె మాట్లాడారు. ఇది రాజీవ్‌ గాంధీ కలల బిల్లు అని ఈ సందర్భంగా సోనియా చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాటం చేసామన్నారు. ఈ బిల్లుతో రాజీవ్‌ గాంధీ స్వప్నం సాకారమైందని చెప్పారు. మ‌హిళా బిల్లుకు తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. భార‌తీయ మ‌హిళ‌ల జీవ‌న ప్ర‌యాణం గురించి ఆమె ప్ర‌స్తావించారు. భార‌తీయ మ‌హిళ‌ల త్యాగాల‌ను గుర్తించాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌న్నారు. దేశ చ‌రిత్ర‌లో ఎంతో మంది మ‌హిళామ‌ణులు ఉన్నార‌ని, స‌రోజినీ నాయుడు, సుచిత్రా క్రిప‌లాని దేశం కోసం పోరాడార‌ని, మ‌హాత్మా గాంధీ, అంబేద్క‌ర్ చూపిన మార్గంలో వాళ్లు న‌డిచార‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ మ‌హిళా బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు చెప్పిన సోనియా గాంధీ.. దేశ‌వ్యాప్తంగా జ‌న‌గ‌ణ‌న కూడా చేప‌ట్టాల‌న్నారు. భార‌త నారీ శ‌క్తి ఎంతో ఘ‌న‌మైంద‌ని, స్త్రీల త్యాగాలు ఎన‌లేనివ‌ని, మ‌హిళా బిల్లును త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని ఆమె కోరారు. భార‌తీయ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున నారీ శ‌క్తి బంద‌న్ అదినియంను స‌మ‌ర్ధిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులో ఓబీసీల‌ను కూడా చేర్చాల‌ని ఆమె డిమాండ్ చేశారు.